మూడు ఉత్తరాది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోవడం సాధారణ ఎన్నికల ముందు బీజేపీకి కొంత మేరకు ఎదురు దెబ్బగానే పరిగణించ వలసి వస్తున్నా, కొన్నాళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పలు అపశకునాలు ఎదురవుతూ వస్తున్నాయి. 2013లో తమ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆయనను బిజెపి అధికారికంగా ప్రకటించిన తర్వాత మొదటి సారిగా పార్టీలో ఆయన నాయకత్వ సామర్ధ్యం పట్ల ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ప్రతి రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రులకు ఉన్న ప్రజాకర్షణ కన్నా ప్రధాని మోదీ పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉన్నదనే ప్రచారం జరుగుతూ వచ్చింది. బీజేపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంటేఆయా రాష్ట్రాలలో మోదీ పట్ల మాత్రం ఆకర్షణ ఎక్కువగా ఉన్నదనే బలమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. గుజరాత్, కర్ణాటక ఎన్నికలలో స్థానికంగా గల ప్రజా వ్యతిరేకతను చివరి రోజులలో సుడిగాలి ప్రచార సభల ద్వారా మోదీ పటాపంచలు చేశారని కూడా చెప్పుకొంటూ వచ్చారు.
కానీ, ఇపుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. పరిపాలన సామర్థంలో పలువురు బిజెపి ముఖ్య మంత్రులు కేంద్ర ప్రభుత్వం కన్నా విశేషమైన ప్రతిభ చూపిస్తున్నట్లు పలు సంకేతాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో అధికారం కోల్పోయినా కాంగ్రెస్,బిజెపిల మధ్య ఓట్ల శాతం ఒక శాతం కన్నా తక్కువగా ఉండడంతో ఆయా రాష్ట్రాలలో మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలలో నెలకొన్న అసంతృప్తి పార్టీ అధికారం కోల్పోవడానికి దారితీసినట్లు కొందరు విశే్లషణలు చేస్తున్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజులకే పరిపాలనలో విఫలం అయ్యారనే ప్రచారం ఎదు ర్కొంటున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ ఐదు నగర పాలక సంస్థల మేయర్ పదవులకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికలలో ప్రతిష్టగా తీసుకొని బిజెపికి ఘన విజయం తీసుకు రాగలిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ప్రభుత్వంపై ప్రధాన ప్రచార అస్త్రంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉపయోగించుకున్న రాఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఆ వివాదం సద్దు మణగక పోవడం గమనార్హం. ఈ విషయమై పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదటి వారం రోజుల పాటు తీవ్ర అంతరాయాలు గురయినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించవలసి వచ్చింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ వేదికలపై చర్చించే సాహసం కూడా నరేంద్ర మోదీ గాని, అమిత్ షా గానీ చేయడం లేదు. వేరే వేదికల నుండి సమర్ధించుకొనే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ప్రతి వారం జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ వారం మోదీ, అమిత్ షా ఇద్దరు గైరాజరు అయ్యారు. దాంతో పార్టీ ఎంపీల ఆందోళనలను నివృత్తి చేసే బాధ్యత హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ పై పడింది. ప్రధాన మంత్రి మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలోనే ఆ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా గల పదవిలో ఉన్న ప్రముఖ రైతు నాయకుడు కిషోర్ తివారి ఆర్‌ఎస్‌ఎస్ అధినేతలకు వ్రాసిన లేఖ బీజేపీలో ఒకవిధంగా పెను సంచలనానికి దారితీస్తుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తిరిగి గెలుపొందాలంటే మోదీ, అమిత్ షాలను తప్పించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేతలు మోహన్ భగవత్, భయ్యాజీ జోషిలకు సూచించారు. ఈ ద్వయం రైతు వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకం కావడంతో వీరి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడం తగదని వారించారు.
ఆ విధంగా బహిరంగంగా బీజేపీలో మరెవ్వరు చెప్పలేక పోతున్నా అటువంటి అభిప్రాయాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. రైతు సంక్షోభం, యువతలో ఉపాధి అవకాశాలు లేక అసంతృప్తి, పెరుగుతున్న ధరలు ప్రధానంగా బీజేపీ పట్ల ప్రజలలో వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. గ్రామాలకు విద్యుత్, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా వంటి పలు మహత్తర కార్యక్రమాలను విజయవంతంగా మోదీ ప్రభుత్వం అమలు జరుప గలింది. అయితే ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల ఆదాయాలను పెంచలేక పోయింది. వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచలేక పోతు న్నాయి. అందుకనే బీజేపీకి మంచి పట్టు గల పట్టణ ప్రాంచలలో కూడా ఆ పార్టీ ప్రాబల్యం తగ్గుతూ వస్తున్నది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ నాయకులు గొప్పగా మాటలు చెప్పుతూ ఉండటమే గానీ ఆ దిశలో ఎటువంటి ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం అదనంగా ఆదాయం వచ్చేటట్లు చేస్తాం అని ప్రధాని హామీ ఇచ్చారు.
This golden-nectar blush gives any look a natural-looking warm glow click on image
This golden-nectar blush gives any look a natural-looking warm glow click on image
రైతుల ఆదాయం పెంచడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం తమ ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక గానీ, కార్యక్రమం గాని లేదని ఆమె చెప్పడం గమనార్హం. ఆకర్షణీయమైన నినాదాలతో, ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో ప్రచార సభలలో ప్రతాపం చూపడం మానుకొని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తగు పరిష్కార మార్గాలతో ప్రజల ముందుకు రావలసిన సమయం ఆసన్నమైనది గమనించాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకొక్క రాష్ట్రంలో ఓటమి చెందుతున్న కాంగ్రెస్ అస్తిత్వమే కోల్పోతున్నదని, ఆ పార్టీ మరెక్కడ గెలిచే అవకాశం ఉన్నదంటూ అమిత్ షా చెప్పుకొంటూ వచ్చారు. ఇప్పటికే 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ ఎక్కడ ఉన్నదంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు భాజపా రాష్ట్రాల సంఖ్య 16కు తగ్గింది. సంవత్సరం క్రితం లోక్ సభ ఎన్నికలలో 350 సీట్లు గెల్చుకోవడం తమ లక్ష్యంగా- మిషన్ 350-ని అమిత్ షా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రస్తావనను బీజేపీ నేతలు ఎవ్వరూ తీసుకు రావడం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపికి సొంతంగా ఆధిక్యత రావడం అసంభవం అని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అయితే మిత్ర పక్షాలతో కలసి మరలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటూ భరోసా వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రయోజనం పొందాలని చూస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పుకోదగిన ప్రయోజనం పొందలేక పోతున్నారు. ఆయనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా డీ ఎంకే అధినేత యంకె స్టాలిన్ ప్రతిపాదిస్తే దేశంలో మరెవ్వరూ కూడా స్టాలిన్‌కు మద్దతు పలక లేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రతిపాదన పట్ల వౌనం వహించవలసి వచ్చింది. కాంగ్రెస్ ఉనికిని కాపాడటమే అజెండాగా పెట్టుకొని తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహితం ఈ విషయమై నోరు పెగల్చడం లేదు. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఉత్తర ప్రదేశ్ లో కూటమి ఏర్పాటు చేయబోవడం గురించి మాయావతి, అఖిలేష్ యాదవ్ ఒక అవగాహనకు రావడం ఈ సందర్భంగా గమనార్హం. నిజంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వేస్తే మాయావతి, అఖిలేష్, మమతలు కలసి 100కు పైగా సీట్లను గెల్చుకొనే అవకాశం ఉంది. వీరికి తోడుగా శరద్ పవర్ వంటి నేతలు సహితం రాహుల్ గాంధీని ప్రధానిగా ఆంగీకరించే అవకాశం లేనే లేదు. అందుచేత ఫలితాలు ఎంత నిరాశాజనకంగా ఉన్నప్పటికీ బీజేపీ లేకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండే అవకాశాలు లేవని స్పష్టం అవు తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాలలో కూడా పదవి చేపట్టిన రెండు, మూడు రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ఇటువంటి హామీ ఇచ్చింది. 2014 ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సహితం ఇటువంటి హామీ చేశాయి. మహారాష్టల్రో రైతుల నుండి వచ్చిన వత్తిడుల దృష్ట్యా బిజేపీ ఇటువంటి హామీ ఇచ్చింది. ఈ వారం అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చింది. ఒడిశాలో తాము అధికారంలోకి వస్తే రైతుల రుణ మాఫీ చేస్తామని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. గతంలో మొదటి సారిగా జాతీయ స్థాయిలో విపి సింగ్ ప్రభుత్వం, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం రుణమాఫీ చేశాయి.
పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసాయి. అయితే రుణ మాఫీ వల్లన రైతుల పరిస్థితులలో చెప్పుకోదగిన మార్పులు జరిగిన్నట్లు ఎక్కడా వెల్లడి కాలేదు. రుణ మాఫీ కేవలం బ్యాంకులు తమ మొండి బకాయిలను చెల్లించినట్లు చూపుకోవడానికి ఉపయోగ పడుతున్నాయి గాని, రైతులను రుణ విముక్తులను చేసి, తాజాగా రుణాలు పొందేటట్లు చేయడం లేదు. రైతుల ఆదాయం మెరుగైతే, వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభిస్తే, వ్యవసాయ మార్కెట్‌లలో దళారీల ప్రమేయం లేకుండా చేయగలిగితే గాని రైతాంగ సంక్షోభం నివారించడం నివారించడం సాధ్యం కాదు.
వాస్తవానికి ఆ దిశలో చెప్పుకోదగిన కృషి చేసినది శివరాజ్ సింగ్ ప్రభుత్వం మాత్రమే. అయితే ఆ రాష్ట్రంలోనే తీవ్రమైన రైతుల అసంతృప్తిని చవి చూడవలసి వచ్చింది. కానీ రైతాంగ పోరాటాలు జరిగిన ప్రాంతాలలో బీజేపీ ఘనవిజయాలు సాధించింది. ఈ సందర్భంగా నేడు దేశాన్ని వేధిస్తున్నది రైతులు, యువకులలో నెలకొన్న అశాంతి. రైతులలో నెలకొన్న అశాంతిని పరిష్కరించే దిశలో కృషి చేయగల సామర్ధం ఉన్న నేతగా చౌహన్‌ను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారెవ్వరూ ఆ దిశగా దృష్టి సారించగలిగే వారు కారని స్పష్టం అవుతున్నది. ఆకర్షణీయమైన, ఆకట్టుకొనే నినాదాలతో కాకుండా దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించగల స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో బిజెపి, కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు 2019 ఎన్నికలలో ప్రజల ముందుకు వస్తే దేశ రాజకీయ గమనంలో కీలక మార్పుకు అవకాశం ఏర్పడుతుంది.
Reviewed by VAIKUNTAPALLI LATEST NEWS UPDATES
on
December 22, 2018
Rating:
No comments: