కమలనాథుల’కు గుణపాఠం ఇది...


అయదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీకి పెద్ద ఎదురు దెబ్బ కాగా, కాంగ్రెస్‌కు ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. 2013 నుండి దేశంలో అత్యంత ప్రజాకర్షణ గల నేతగా ప్రాచుర్యం పొందుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను ఆకట్టుకొనే సామర్ధం పట్ల ఇప్పుడు నీలినీడలు వ్యాపిస్తున్నాయి. మరోవంక గత కొనే్నళ్లుగా ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ ఘోర పరాజయం చెందడం ఖాయం అనే ఖ్యాతిని మూట గట్టుకొంటూ వస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తొలిసారి నిర్ణయాత్మకమైన విజయం తాజా ఎన్నికల్లో లభించింది.

2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన అయదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సహజంగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భవిష్యత్ పై గణ నీయ ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఫలితాలు భాజపాకి అంతు బట్టడం లేదు. రాజస్థాన్‌లో తమకు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నదని, అక్కడ ఓటమి తథ్యమని భాజపా నేతలు ముందుగానే సిద్ధపడ్డారు. మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన పోటీ ఉంటుందని, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం విజయానికి ఢోకా లేదని ఫలితాలకు ముందు భాజపా నేతలు నిర్ధారణకు వచ్చారు. అయితే, అనూహ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పరాభవం ఎదురైనది. 15 ఏళ్లుగా భాజపా అధికారంలో ఉండగా 15 సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. అజిత్ జోగి, బీఎస్పీ కలసి పోటీ చేయడంతో కాంగ్రెస్ ఓట్లు చీలి తాము గెలుస్తాం అనుకొంటే, ఆ రెండు పార్టీలూ బిజెపి ఓట్లను చీల్చి పరాభవం కలిగించారు. మధ్యప్రదేశ్‌లో దాదాపు కాంగ్రెస్‌కు సమానంగా సీట్లు సంపాదించారు. కేవలం ఆరేడు సీట్ల తేడాలో భాజపా ఓటమి పొందింది. పైగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్, భాజపాల మధ్య ఓట్ల తేడా 1 శాతం కన్నా తక్కువగా ఉంది. ఆ రెండు రాష్ట్రాలలో అంతటి గట్టి పోటీ ఇచ్చిన ఘనత భాజపా ముఖ్యమంత్రులకే దక్కుతుంది. 
ప్రధాని మోదీ పట్ల ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉన్నదని, అయతే బిజెపి ముఖ్యమంత్రులే తీవ్ర వ్యతి రేకతను ఎదుర్కొంటున్నారని, చివరి వారంలో ప్రచారం చేయడం ద్వారా మోదీ ఆ ప్రజావ్యతిరేకతను అధిగమించే ప్రయత్నం చేశారని భాజపా నేతలు అంటున్నారు. అయితే మూడు బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగింది వేరు. రాజస్థాన్ లో ముఖ్యమంత్రి వసుంధర రాజే వ్యవహార శైలి పట్ల కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ పరిపాలనలో ఆమె సామర్ధం పట్ల ఎటువంటి ఆరోపణలు లేవు. ప్రజా దరణలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులకు పోటీ పడగల నేతలు ఆయా రాష్ట్రాలలో మరే పార్టీలో కూడా లేరు. ముగ్గురు ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు గానీ, పాలనా పరమైన విమర్శలు గానీ లేవు. బిజెపి అభ్యర్థులకు ఎదురైన ప్రజా వ్యతిరేకత ప్రధానంగా ప్రధాని మోదీ పాలనకు సంబంధించే.


యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, వ్యవసాయ రంగంలో సంక్షోభం, రాఫెల్ ఒప్పందంపై చెలరేగుతున్న ఆరో పణలు, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను నిర్వీర్యం చేయడం, పెద్దనోట్ల రద్దుతో చిన్న వ్యాపారులు చితికి పోవడం, బ్యాంకింగ్ రంగంలో గందరగోళం వంటి పరిస్థితులు నెలకొన్నాయ. ఆయా సీఎంల సొంత సర్వేలు సైతం ఈ విషయాలనే స్పష్టం చేశాయి. అందుకనే వ్యూహాత్మకంగా ప్రధాని మోదీ ఈసారి చాల తక్కువగా ప్రచారం చేశారు. ఇదివరలో రోజుకు ఐదు ఎన్నికల సభలలో ప్రసంగిస్తే ఈ పర్యాయం రెండింటిలోనే ప్రసంగించారు. గుజరాత్‌లో 34, కర్నాటకలో 21, మధ్యప్రదేశ్‌లో 11, ఛత్తీస్‌గఢ్‌లో 4, తెలంగాణలో 3 సభలకు ఆయన పరిమితమయ్యారు. మరోవైపు కేంద్రంలో పరిపాలన ప్రధాని అదుపులో ఉన్నదా? అనే సందేహం కలుగుతున్నది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని, అదీ ఓ ఐఏఎస్ అధికారిని ఆర్బీఐ గవర్నర్‌గా నియమించి మోదీ ఎటువంటి సందేశం ఇస్తున్నారు?

తమ ఓటమికి ‘నోటా’ ఓట్లు కారణం అనే తేలికపాటి వివరణతో సరిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు భాజపా నాయకులు. కానీ పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా చాలా తక్కువ తేడాతో ఓటమి చెందారు. కాబట్టి ‘నోటా’ ఓట్లు అన్ని పార్టీలపై ప్రభావం చూపుతాయి. భాజపా పరాజయానికి కేంద్ర ప్రభుత్వ పనితీరు ఒక ప్రధాన కారణం కాగా, తమ ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా కేంద్రం నుండే ఇతర నేతలను ప్రోత్సహిస్తూ, వారిని అస్థిర పరచే ప్రయత్నాలు కాంగ్రెస్ తరహాలో జరగడం, అంతర్గత కుమ్ములాటలకు దారితీయడం మరో కారణం అని చెప్పవచ్చు. అంతమాత్రం చేత ముఖ్యమంత్రులు పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు చెప్పలేం. ప్రజాబలాన్ని కూడదీసుకునే మరే నాయకుడిని చూసినా సీఎం పదవికి పోటీకాగలరని అటువంటి వారిని బలహీన పరచే ప్రయత్నం చేయడం, అలాంటివారిని కేంద్రానికి పంపి అక్కడ కూడా పదవులు లేకుండా చూడటం వంటి కుతంత్రాలు చేస్తున్నవారు ఉన్నారు.
ఇక అభ్యర్థుల ఎంపిక ఎక్కడా పారదర్శకంగా జరగలేదు. 
క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, పార్టీ పట్ల అంకితభావం ఉండి, విజయా వకాశాలు ఉన్నవారికి టిక్కెట్లు ఇవ్వడం లేదు. తెలుగు రాష్ట్రాలలో గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా నిర్ణయాత్మక పాత్ర వహిస్తాం అన్న తెలంగాణలో కేవలం ఒక్క సీటుకు భాజపా పరిమితం కావడం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వ వైఫల్యమై కారణం అని అందరికీ తెలుసు. రాష్ట్ర ఇన్ ఛార్జ్‌లుగా వచ్చిన నేతలందరూ స్థానిక నేతల ధోరణితో విసుగు చెంది వెళ్లిపోతున్నారు.

తమ భజనపరులు, పార్టీలో ఎప్పటికీ నేతలుగా ఎదగలేని వారు, డబ్బులు కురిపించగల వారికి మాత్రమే సీట్లు ఇస్తూ ప్రజల మధ్య బలం సంపాదించుకొనే వారంటే భయపడుతూ వస్తున్నారు. గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్‌కు సీటు ఇవ్వరాదని ఇక్కడ అందరూ పట్టుబట్టిన వారే. అయితే అమిత్ షా పట్టుబట్టి రాజాసింగ్‌కు టిక్కెట్ ఇచ్చారు. అతనికి సహాయ నిరాకరణ చేయాలని, ఎవరూ పని చేయవద్దని పార్టీ పెద్దలే ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రాజాసింగ్‌ను గెలిపించారు. ఇది బీజేపీ, ఆ పార్టీని నడిపిస్తున్న వారికి ఒక గుణపాఠం కావాలి.

మధ్యప్రదేశ్‌లో స్థానిక కార్యకర్తల అభిప్రాయాలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రికి సన్నిహితుడని, ఢిల్లీలోని పార్టీ నేతలకు ఇష్టులు అనో సీట్లు ఇచ్చిన వారంతా పరాజయం చెందారు. ఉదాహరణకు బీజావర్ లో స్థానికంగా మంచి పలుకుబడి గల బాబు భయ్యాను కాదని తీవ్ర ప్రజావ్యతిరేకత పొందుతున్న బయటి వ్యక్తికి ముఖ్యమంత్రి పట్టుబట్టి సీటు ఇచ్చారు. దాంతో బాబు భయ్యా సమాజ్ వాద్ పార్టీ సీటు పొంది 35 వేల ఆధిక్యతతో గెలుపొందారు. 
అభ్యర్థుల ఎంపికలో పలుకుబడి గల కేంద్ర, రాష్ట్ర నేతలు ప్రతి చోటా కూడా తమ భజనపరులు, బంధువులు, ఆర్థిక లావాదేవీలు గలవారు, తమకు నమ్మినబంట్లుగా ఉండేవారికి సీట్లు ఇవ్వడానికి సుముఖత చూపారు. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య పనిచేసున్న వారంటే భయపడుతూ వచ్చారు. వారు నాయకులుగా ఎదిగితే తమకు ఎక్కడ పోటీకి వస్తారో అనే విధంగా వ్యవహరించారు. కేవలం ధనబలం, అధికార బలంతో గెలుపొందవచ్చనే అహంకారం పలు చోట్ల భాజపా పరాజయానికి దారితీసింది.

బిజెపి పట్ల ఈ ఎన్నికలలో ప్రజలు వ్యతిరేకతను స్పష్టంగా వ్యక్తం చేశారు. అందుకు కారణాలను గుర్తించి, సరిచేసుకొనే ప్రయత్నం చేయని పక్షంలో 2019 ఎన్నికలలో మరో పరాభవం తప్పదని గ్రహించాలి. మూడు ప్రధాన హిందీ రాష్ట్రాలలో పోటీ ప్రధానంగా బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్యనే ఉన్నప్పటికీ, బిజెపి వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్‌కు గుడ్డిగా మద్దతు ఇవ్వక పోవడం గమనార్హం. 

ఇంకా కాంగ్రెస్‌ను విశ్వసించే స్థితిలో ప్రజలు లేరని గ్రహించాలి. అందుకు కాంగ్రెస్ మరెంతో కష్ట పడాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడురోజుల వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులను నిర్ణయించకుండా ఢిల్లీలో మంతనాలు జరపడం, ఆ పదవి కోసం పోటీపడుతున్న నేతల అనుచరులు పార్టీ కార్యాలయాల వద్ద, రహదారులపై ఆందోళనలకు దిగడం, రాజస్థాన్‌లో విధ్వంసక ఘటనలు జరగడం గమనిస్తే కాంగ్రెస్‌ను సంస్కరించే సామర్ధ్యం రాహుల్ గాంధీకి ఉందా? అనే అనుమానం కలుగుతున్నది. యువనేతలను ముఖ్య మంత్రులుగా చేయాలని రాహుల్ వాదిస్తుండగా, ఆయన తల్లి సోనియా గాంధీ వృద్ధనేతలకు పట్టం గట్టాలని వత్తిడి తెచ్చారనే కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీగా ఉందనడానికి ఇంతకన్న మరో ఉదాహరణ అవసరమా ?

కాంగ్రెస్‌లోని బలహీనతలు తమను కాపాడలేవని బిజెపి నేతలు కూడా గ్రహించాలి. పార్టీలో విధాన ని ర్ణయాలు తీసుకొనే విషయంలో విస్తృత సంప్రదింపులు లేకపోవడం, కొద్దిమంది వ్యక్తుల ఇష్టాయిష్టాల మేరకు జరగడం, ప్రజలలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటమే ప్రస్తుత అనర్థాలకు కారణమని గుర్తెరగాలి. పార్టీ అంతర్గత వేదికలపై అర్థవంతమైన సమాలోచనలకు అవకాశం కల్పించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ కార్బన్ కాపీ వలే మారితే ప్రయోజనం ఉండదు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారిని నిర్లక్ష్యం చేసి రాష్ట్ర, కేంద్ర నేతలు బలవంతంగా అభ్యర్థులను రుద్దే ప్రయత్నం చేస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని గ్రహించాలి. తెలంగాణ వంటి చోట్ల ప్రజల మధ్య పనిచేసే వారు గెలుపొందితే హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని పదవులు పొందుతున్న వారిలో అభద్రతాభావం పెరిగిపోతున్నది. పరిపూర్ణానంద స్వామి వంటి వారు పార్టీకోసం పనిచేయడానికి ముందు వచ్చినా, కరీంనగర్, కల్వకుర్తి వంటి చోట్ల ప్రజల మధ్య ఉంటూ గట్టి పోటీ ఇస్తున్న నాయకులు ఉన్నా అటువంటి వారిని నిరుత్సాహ పరచే ప్రయత్నమే చేస్తున్నారు. ఇదే విధంగా దేశం అంతటా జరుగుతున్నది.

స్తవానికి ప్రస్తుతం దేశంలో అత్యంత ఆచరణాత్మరాజకీయక  ఎత్తుగడలు వేయగల నేత అమిత్ షా అని చెప్పవచ్చు. క్షేత్ర స్థాయిలో ఎవరెవరు ఏమిటో ఆయన వద్ద పూర్తి సమాచారం . కేవలం పార్టీ నేతలపై ఆధారపడకుండా వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ఉందిభజనపరులకు పెద్ద పీట వేసే ప్రయత్నం చేయడం లేదు. పలు సందర్భాలలో ప్రధాన మంత్రిని సైతం ఒప్పించి, భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పట్టుదల కారణంగానే యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి కాగలిగారు. అటువంటి అమిత్ షాకు ఈ పర్యాయం అనూహ్యమైన వర్గాల నుండి ఎదురైన వత్తిడులు విస్మయానికి, ఆగ్రహనికి గురయ్యేటట్లు చేశాయని తెలుస్తున్నది. వివిధ స్థాయిలలో బలమైన నాయకత్వం బలపడినప్పుడే పార్టీ పటిష్టం కాగలదు. కేవలం సభ్యత్వం పార్టీ బలాన్ని పెంచదని తెలంగాణ ఎన్నికల ఓటమి నుండి గ్రహించాలి. పలు నియోజకవర్గాలలో పార్టీకున్న సభ్యుల సంఖ్యను బట్టి కూడా ఓట్లు రాలేదు. బలమైన ప్రజాస్వామిక, పారదర్శకత గల సమష్టి నాయకత్వంతో పనిచేసే పార్టీగా బిజెపిని సంస్కరించాలి. అప్పుడే కాంగ్రెస్‌కు భిన్నమైన, నిజమైన ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ప్రజల మన్ననలు పొందగలదని గ్రహించాలి.
-చలసాని నరేంద్ర  

Reviewed by VAIKUNTAPALLI LATEST NEWS UPDATES on December 19, 2018 Rating: 5

No comments:

Powered by Blogger.